Telangana: పశుసంవర్ధక శాఖ పత్రాల మాయంపై దర్యాప్తు ముమ్మరం
CCTV దృశ్యాలను పరిశీలించిన అధికారులు;
పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పత్రాల మాయంపై పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. కార్యాలయ పరిసరాలలోని CCTV దృశ్యాలను పరిశీలించిన అధికారులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇవాళ నిందితులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక సాంకేతిక విద్యామండలి కార్యాలయం నుంచి.. పాత సామగ్రే తరలించినట్లు విచారణలో సిబ్బంది వెల్లడించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలకపత్రాల మాయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వరుస ఘటనలు జరిగిన ప్రాంతాల్లో CCTV కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఈ కార్యాలయంలోకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ OSD కల్యాణ్ అక్రమంగా వెళ్లారని... పత్రాలు తీసుకెళ్లారని శనివారం నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అదేరోజు రాత్రి సాంకేతిక విద్యామండలి కార్యాలయం నుంచి... ఇద్దరు వ్యక్తులు దస్త్రాలు తీసుకెళుతుండటం గమనించిన కొందరు.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో CCTV కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడి నుంచి వస్తువులను తరలించేందుకు ఆటోలను సిద్ధం చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు... కీలక ఆధారాలు సేకరించారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్లుగా అంచనాకు వచ్చారు. మాసబ్‌ట్యాంక్, మల్లేపల్లి, NMDC, బంజారాహిల్స్ మార్గాల్లోని కెమెరాల ఫుటేజీలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుల్లో పలువురు నిందితులను ఇవాళ ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక దస్త్రాలు, పత్రాల స్థితిగతులపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ కార్యాలయంలో.. ఫైళ్ల చోరీ యత్నం జరిగిందంటూ అందిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో... హైదరాబాద్ అబిడ్స్ పోలీసులు పురోగతి సాధించారు. కార్యాలయ ఆవరణలోని మాజీమంత్రి సబితారెడ్డి కార్యాలయాన్ని... 6 నెలల క్రితమే ఇక్కడి నుంచి కొత్త సచివాలయంలోకి మార్చారు. అదే సమయంలో ఫైళ్లు, ఇతర సామగ్రి తీసుకెళ్లారు. అయితే మాజీ మంత్రి కార్యాలయంలో పాత ఫర్నిచర్, రెండు తుప్పుపట్టిన అల్మారాలను వదిలేసి వెళ్లారు. వాటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. అదే కార్యాలయంలో అటెండర్లుగా పనిచేస్తున్న మహ్మద్ షరీఫ్, రవి ఇరుక్కున్నారు. శనివారం గూడ్స్ ఆటో తీసుకొచ్చి పాత ఫర్నీచర్‌ను తీసుకెళ్లేందుకు యత్నించగా... అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యాలయం వాచ్‌మన్ స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు... ఇద్దరిని పిలిపించి స్టేట్‌మెంట్ నమోదు చేశారు. విరిగిన కుర్చీలు, రెండు అల్మారాలను తీసుకెళ్లేందుకు శాఖలోని ఓ అధికారి అనుమతి తీసుకొని వచ్చామని... అయితే అక్కడ ఫొటోలు తీయడం... అలజడి కనిపించడంతో భయంతో పారిపోయినట్లు వారు పోలీసులకు తెలిపారు.