హైదరాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు పునర్విచారణ చేపట్టారు. అంతేకాక, ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో జరిగిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న రణ్వీర్ అనే ఆరు నెలల వయస్సు ఉన్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కారు మీద ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఆధారంగా అది అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన వాహనంగా పోలీసులు గుర్తించారు.
అయితే, కారు నడిపి, ప్రమాదం చేసింది తానేనంటూ అఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగా, రాహెల్ ఇటీవల నిర్లక్ష్యంగా కారును నడిపి ప్రగతి భవన్ వద్ద బ్యారికేడ్లను ఢీకొట్టాడు. ఈ కేసు విషయంలో నిందితుల తారుమారు వంటి ఘటనలు వెలుగు చూడడంతో.. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసుపై పోలీసులు మళ్లీ దృష్టి పెట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో రాహెల్ కారులో ఉన్నట్టు గుర్తించారు. 2022లో ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారుల పాత్ర పై కూడా పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం.