తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గురువారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ఐదు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో హెచ్చరికలను జారీ చేసింది.
బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ర్టంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.