గత వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్‌కు 3,77,00 క్యూసెక్కుల వరద వస్తుండగా, 37 గేట్లను ఎత్తి 3,69,874 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. అధికారులు 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్, టైల్ పాండ్, పులిచింతల, కృష్ణా బ్యారేజీ గేట్లను కూడా ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు నేరుగా సముద్రంలోకి ప్రవహిస్తోంది. గేట్లు ఎత్తడం ఈ సీజన్ లో ఇది పదవ సారి కావడం గమనార్హం.