తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళ సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళల ఆర్థిక భద్రతే లక్ష్యంగా రిజిస్ట్రేషన్లలో మహిళల వాటా పెంచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే లక్ష్యంతో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు-2025ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు..
ఇందులో భాగంగా ప్రస్తుత మార్కెట్ విలువకు అనుగుణంగా భూముల ధరలను సవరించనున్నారు.. ఈ విధానం ప్రకారం మహిళలకు స్టాంపు డ్యూటీ లో ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం అనే చెప్పొచ్చు. ఇది మహిళా సాధికారతకు, వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
కొత్త స్టాంప్ సవరణ బిల్లు-2025 అమల్లోకి వస్తే.. స్టాంపు డ్యూటీ ఆస్తి విలువలో 6 శాతంగా విధించే అవకాశం ఉంది. ఈ మొత్తంలో రిజిస్ట్రేషన్, బదిలీ ఛార్జీలు కూడా చేర్చబడతాయి. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి విలువలో 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. ఆస్తి ఇతరుల పేరిట బదిలీ చేసినప్పుడు, ఆస్తి విలువలో 1.5 శాతం బదిలీ సుంకం చెల్లించేలా చట్టంలో పొందుపరచనున్నారు. ఈ మార్పులు రియల్ ఎస్టేట్ రంగానికి ముఖ్యంగా మహిళల ఆర్థిక భద్రత కు మరింత ఊతం ఇవ్వనున్నాయి.