వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణనాథుడు తొలిపూజలను అందుకున్నారు. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువు తీరిన గణనాథునికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజలు నిర్వహించారు. ముందుగా 20 మంది సిద్ధాంతులు ప్రత్యేకంగా కలశపూజ, ప్రాణ ప్రతిష్ట వంటి కార్యక్రమాలను నిర్వహించి, గణేషుడికి పవిత్రమైన గాయత్రీ యజ్ఞోపవీతాన్ని వేశారు. అనంతరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణనాథుడికి పూజలు చేసి, హారతి సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తితో...శాంతమూర్తిగా గణపయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నారు. విగ్రహానికి ఇరువైపులా పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడితో పాటు లక్ష్మీసమేత హయగ్రీవస్వామి, ఖైరతాబాద్ గ్రామ దేవత గజ్జెలమ్మ అమ్మవారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు.