Hyderabad : ఫ్యూచర్ సిటీకి అనుబంధంగా మొత్తం 9 రేడియల్ రోడ్లు

Update: 2025-03-03 11:15 GMT

పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తున్న 9 రేడియల్ రహదారుల్లో పెద్దదైన ఎయిరోపోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించనున్న తొలి దశలో భాగంగా రావిర్యాల నుంచి అమ నగల్ వరకు నిర్మించనున్న 41.5 కి.మీ రహదారికి సంబంధించి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.2000 కోట్లు మంజూరు చేస్తూ పనులు ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను, రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను అనుసంధానం చేస్తూ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబరు 13 రావిర్యాల నుంచి రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలం ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న ఈ రహదారి ఫ్యూచర్ సిటీ నుంచి వెళ్లి స్కిల్ డెవలపమెంట్ యూనివర్శిటీని చేరుతుంది. రెండు దశల్లో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు పనుల్లో తొలిదశలో 20 కి.మీ కోసం రూ.2000 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

రేడియల్ రోడ్డు తొలిదశ కోసం ఆరు మండలాల్లోని 15 గ్రామాల్లో 916 ఎకరాలు సేకరించనున్నారు. లాండ్ పూలింగ్ విధానం అమలుకు సంబంధించి మూడు విభాగాల అధికారులు కసరత్తు పూర్తిచేసి ఇప్పటికే రెండు నమూనాలను కూడా సిద్ధం చేశారు. ఒక నమూనాలో కిలోమీటరు మేర మరో నమూనాలో అర కిలోమీటరు మేర భూ సమీకరణ చేసి, వాటిలో లాజిస్టిక్ పార్కులు, పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటుచేస్తారు.

Tags:    

Similar News