తెలంగాణలో రాబోయే ఐదురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర కోస్తా, తమిళనాడులో కేంద్రీకృతమైన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుందని.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశకు వంగి ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఈ నెల 20 వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావంతో 22 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది.