గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు...చర్యలకు ఉపక్రమించారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటి పారుదల శాఖాధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై సమీక్ష నిర్వహించిన ఆయన...నీటి పారుదల శాఖలో ఉన్న అన్ని విభాగాల ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, అనకట్టలు, కాల్వలతో పాటు చేరువులపై నిఘా పెంచాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. విపత్తు సూచనలు కనిపిస్తే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సహా అన్ని విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందస్తు భద్రత చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తో పాట స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆయా జిల్లాల సీఈలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.chat