HYDRA: హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ
భారీగా వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కార్యాచరణ... స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కమిషనర్;
బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి భారీగా వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు. చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలపై 89 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ప్రాంతాల వారీగా ఉన్న అధికారులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అమీన్‌పూర్.. పరిసర ప్రాంతాల నుంచి అధిక ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో వాటిపై రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మునిసిపాలిటీ పరిధిలో మేడికుంట చెరువు 45 ఎకరాల్లో ఉండేదని, ఆక్రమణలతో చెరువు కుచించుకుపోయిందని వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా కమిషనర్
హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి కమిషనర్ ఏవీ రంగనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులకు సంబంధించి వినతి పత్రాలను సేకరించారు. హైడ్రా నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటుందని కమీషనర్ రంగనాథ్ వెల్లడించారు.
కబ్జాకు ఆస్కారం లేకుండా చర్యలు: హైడ్రా కమిషనర్
హైదరాబాద్ లో ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారణ పూర్తయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నాలుగైదు నెలల్లో ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులకు ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా ఎన్టీఎల్ నిర్ధారణ జరుగుతుందన్నారు. భవిష్యత్తులో చెరువుల కబ్జాకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
పూజారి పోస్ట్ కు స్పందించిన హైడ్రా కమిషనర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో ఓ ఆలయానికి సంబందించిన కోనేరు కబ్జాకు గురైందంటూ గుడి భూమిని కాపాడాలని ఆలయ పూజారి సామాజిక మాధ్యమాల ద్వారా విలపిస్తూ వైరల్ అయిన వీడియోను చూసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం అధికారులతో కలిసి గుడిని సందర్శించారు. స్థానికంగా ఉన్న పలువురు నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందంటూ, వీరిపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించారు.