HYDRA: సున్నం చెరువులో ఆక్రమణల కూల్చివేత
ఎల్లారెడ్డిగూడలో పార్క్ ఆక్రమణలు తొలగింపు.... హైడ్రాతో ఫలించిన 60 ఏళ్ల పోరాటం;
తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు జరుగుతోంది. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, నివాసాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఇక, 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను సైతం హైడ్రా తొలగిస్తోంది. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా హెచ్చరించింది.
హైడ్రాతో 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం
ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా.. తమకు అప్పగించిన పనులను సమర్థంగా నిర్వర్తిస్తోంది. మధురానగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్క్ ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. 1961 నుంచి ఉన్న ఆక్రమణలను తొలగించడంతో 1533 గజాల విస్తీర్ణంలోని పార్క్ అందుబాటులోకి వచ్చింది. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి విచారణకు ఆదేశించారు. 1961లో 5 ఎకరాల విస్తీర్ణంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఅవుట్ ఏర్పాటు చేశారు. 1,533 గజాల స్థలాన్ని పార్క్‌గా చూపించారు. లేఅవుట్ వేసిన నారాయణ ప్రసాద్ వారసులు పార్కు స్థలంలో షెడ్డు వేసి ఆక్రమించారు. అధికారులను మేనేజ్ చేసి ఇంటి నంబర్ కూడా తెచ్చుకున్నారు. ఈ లేఅవుట్లో 6 రోడ్లను అభివృద్ధి చేసి పార్క్‌ను మాత్రం ఖాళీ చేయించలేదని జీహెచ్ఎంసీ పలుమార్లు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. స్థానికులు పలుమార్లు GHMCకి ఫిర్యాదు చేసినప్పటికీ, 60 ఏళ్లుగా ఈ ఆక్రమణను తొలగించలేకపోయారు. దీంతో.. సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో హైడ్రా( Hydra)కు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ ఆదేశాల మేరకు.. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి, పార్కు స్థలం ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు.