TG : మేము తలచుకుంటే .. రాజీవ్, ఇందిరా విగ్రహాలు ఉండేవా? : కేటీఆర్ లేఖ
బీఆర్ఎస్ తలచుకుంటే రాజీవ్‌గాంధీ పేర్లు, ఇందిరా గాంధీ విగ్రహాలు ఉండేవా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ‘‘తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? నమ్మి అధికారమిస్తే తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తారా? గ్యారంటీలకు దిక్కులేదు.. హామీలకు పత్తాలేదు, డిక్లరేషన్‌కు అడ్రస్ లేదు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల నుంచి ఆడబిడ్డల వరకు అందరూ బాధితులే. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామికవర్గం వరకు అందరూ వంచితులే. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం.. సకల రంగాల్లో సంక్షోభం. పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప.. పేర్లు మార్చలేదు. బీఆర్ఎస్ తలచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉండేవా? నీచ సంస్కృతికి సీఎం ఫుల్‌స్టాప్ పెట్టకపోతే జరగబోయేది అదే’’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.