Sajjanar : ఆడపిల్లల జోలికొస్తే తాట తీస్తా.. సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, కల్తీ ఆహారం, ట్రాఫిక్ సమస్యలు, మహిళలపై అఘాయిత్యాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "హైదరాబాద్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్. దీనిపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామని, అవసరమైతే మరింత సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి నగరంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. కేటుగాళ్లు ఎక్కువగా వృద్ధులను టార్గెట్ చేసి మోసం చేస్తున్నారని, వీటిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పేరుతో వచ్చే కాల్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే కాల్స్, అరుదైన వ్యాధులకు ఔషధాలు అంటూ చేసే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ మోసాలు చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
కల్తీ, బెట్టింగ్‌పై ఉక్కుపాదం కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి కల్తీ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల యువత చెడిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేయవద్దని వీఐపీలను ఆయన కోరారు.
ట్రాఫిక్, మహిళా భద్రతపై హెచ్చరిక నగరంలో ఏటా లక్షల్లో కొత్త వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని సీపీ అంగీకరించారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తామని తెలిపారు. "మద్యం తాగి రోడ్లపైకి వాహనాలతో వస్తే వదిలేది లేదు. అలాంటివారిని రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తాం" అని సీపీ తీవ్రంగా హెచ్చరించారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళల జోలికి వస్తే సీరియస్‌గా తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.