Intermediate Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

Update: 2024-02-28 04:42 GMT

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డ్ అధికారులు చేశారు. మొత్తం 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9. నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ప్రథమ సంవత్సరం నుంచి 4,78,718 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం నుంచి 4,44,189 మంది, సెకండియర్ ప్రైవేట్ 58,071 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 1,521 మంది చీఫ్ సూపరింటెండెంట్, 27,900 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫెయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఆర్టీసీ అందుబాటులో ఉంచనుంది.

పరీక్షల కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఎలాంటి అదనపు పేపర్స్ తీసుకెల్లేందుకు అనుమతి లేదు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఫోన్లను నిషేధించారు. పేపర్ లీకులకు పాల్పడినా, కాపీకొట్టినా వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నారు.

Tags:    

Similar News