KTR: రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారు: కేటీఆర్
రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు... కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని ధీమా...;
తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి MLAలను తీసుకుని... TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తారని KTR ఆరోపించారు. అసలు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించిందే బీజేపీ అని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచి దక్షిణ భారత్‌లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా KCR రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డిలో పర్యటించిన కేటీఆర్.. డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్... పదేళ్ల స్వల్ప కాలంలోనే వందేళ్ల ప్రగతిని పరిచయం చేశామని తెలిపారు.
ఎన్నికల కోసం కర్ణాటక నుంచి కాంగ్రెస్‌కు అదానీ నుంచి బీజేపీకి డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌లో సీట్లు అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలే చెబుతున్నారని KTR విమర్శించారు. అతికష్టం మీద గెలిచే 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రేవంత్‌రెడ్డి బీజేపీలో కలుస్తారని ఆరోపించారు. దక్షిణభారతదేశంలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా K.C.Rను నిలపాలని KTR ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న మంత్రి... తెలంగాణలో గెలిచి మహారాష్ట్రలో సత్తాచాటి... దేశ రాజకీయాల్లో క్రీయశీలక పాత్ర పోషిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.