KCR: ప్రత్యక్ష పోరాటానికి కేసీఆర్ సిద్ధం
బనకచర్ల అడ్డుకునేందుకు పోరాటం... కాంగ్రెస్ పై పోరాడాలని కేసీఆర్ దిశానిర్దేశం... క్షేత్రస్థాయి పోరాటాలకు గులాబీ దళపతి సిద్ధం;
ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, సాగునీటి కోసం వినియోగించడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుని తీరతామని తేల్చి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గం అన్నారు. తమను నమ్మిన ఓటు వేసిన పాపానికి తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత అన్యాయం చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. చంద్రబాబు, మోదీల ప్రయోజనాలు కాపాడేందుకు రేవంత్ రెడ్డి తహతహ లాడుతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరహాలో ఇతర విభాగాలను బలోపేతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలు, ఇతర అంశాలపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షాన నిలిచి, వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం మరింత ఉధృతం చేయాలి. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనని.. పరస్పరం విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం
బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. కాంగ్రెస్కు పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆగసు 8వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. ఈ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టి కాంగ్రెస్ తప్పుకుంటోందని మండిపడ్డారు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే.. మిగిలిన మూడు మంత్రి పదవులను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో డ్రామాలు ఆపాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.