E car Race : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం: పలువురు అధికారుల పై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని నిర్ధారించిన ఏసీబీ నిందితులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఏసీబీ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషన్, అధికారులపై చర్యలకు ఆమోదం తెలిపింది. ఈ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.
మరోవైపు, ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ సమర్పించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌కు పంపించారు. అయితే, గవర్నర్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐఏఎస్ అధికారులపై విజిలెన్స్ సిఫార్సు చేసిన నేపథ్యంలో, కేటీఆర్ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కోసం విదేశీ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్లు చెల్లించారని, దీనివల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.