Kishan Reddy: రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Kishan Reddy: రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎలక్ట్రిక్ బైక్ తయారీలో లోపం ఉంటే సదరు కంపెనీపై కేసు పెట్టాలన్నారు.;
Kishan Reddy : రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎలక్ట్రిక్ బైక్ తయారీలో లోపం ఉంటే సదరు కంపెనీపై కేసు పెట్టాలన్నారు. విద్యుత్ అధికారులు కేవలం కరెంట్ బిల్లులు వసూలు చేయడానికే రాకుండా.. ఇలాంటి కాంప్లెక్సులు, అపార్ట్‌మెంట్లలో తనిఖీలు చేయాలన్నారు.
గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయన్నారు కిషన్ రెడ్డి. అయితే, ప్రమాదం జరిగిన బిల్డింగ్, సెల్లార్‌లోకి వెళ్లకుండా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీ అయిన తననే లోపలికి పంపించకపోవడం ఏంటని మండిపడ్డారు.
సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై క్లూస్ టీమ్ ప్రాథమిక రిపోర్ట్‌ను తయారుచేసింది. హోటల్ సెల్లార్‌లో ఐదు సిలిండర్లు, 40 ఈ-బైక్‌లు, రెండు పెట్రోల్ బైక్‌లు, ఒక జనరేటర్ ఉన్నట్టు గుర్తించారు. సిలిండర్ పేలి ఉంటే గనక భారీ ప్రమాదం సంభవించి ఉండేదని రిపోర్ట్ తెలిపింది. ఎలక్ట్రికల్ బైక్ లేదా జనరేటర్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అగ్నిప్రమాద స్థలంలో శాంపిల్స్ సేకరించిన క్లూస్ టీమ్.. లిథియం బ్యాటరీలకు మంటలు అంటుకోవడం వల్ల ఎక్కువ పొగ వ్యాపించిందని తెలిపింది. సెల్లార్‌లో నుంచి మెట్ల ద్వారా నాలుగు అంతస్తుల వరకు పొగ వ్యాపించిందని చెబుతున్నారు.
రూబీ హోటల్ సెల్లార్‌లో ఏడాది నుంచి అక్రమంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్స్ షోరూమ్ నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అపోలో, యశోద హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో బెంగళూరుకు చెందిన జయంత్ పరిస్థితి విషమంగా ఉంది. రూబీ హోటల్ మేనేజ్‌మెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదం నుంచి బయటపడిన మన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేస్ ఫైల్ చేశారు. హోటల్‌లో మొత్తం 28 రూములు ఉండగా.. ఘటన సమయంలో 25 మంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వైజాగ్‌తో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, బెంగాల్, ఒడిశాకు చెందిన 8 మంది మృతి చెందినట్టు అధికారులు తేల్చారు.