KTR : అబద్దాలతో కిషన్ రెడ్డి మోసం చేస్తున్నారు : కేటీఆర్

KTR : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌.

Update: 2022-07-22 02:33 GMT

KTR : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్రానికి వరద సాయం విషయంలో కిషన్ రెడ్డి తప్పుడు లెక్కలు చెప్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కలిసిరాకుండా...ఎప్పటిలాగే అబద్ధాలు చెప్తున్నారని ఆక్షేపించారు. NDRF,SDRF మధ్య తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండడం దురదృష్టకరమన్నారు.

NDRF ద్వారా కేంద్రం తెలంగాణకు ఇచ్చిన స్పెషల్‌, అడిషనల్ ఫండ్స్‌పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే..రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన, హక్కుగా దక్కే SDRF గణాంకాల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కిషన్‌ రెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు.

విపత్తులతో సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన SDRFకు వచ్చే నిధులు తప్ప...కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఏంటో చెప్పాలన్నారు కేటీఆర్‌. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులనూ కేంద్రమే విడుదల చేసినట్లు చెప్పుకోవడం దౌర్భాగ్యమన్నారు. కేంద్రానికి రాష్ట్రం చెల్లించే పన్నుల్లో నుంచే తిరిగి రాజ్యాంగ పద్ధతుల్లో రాష్ట్రానికి దక్కే మార్గాల్లో SDRF ఒక్కటని..అ మాత్రం అవగాహన లేకపోవడం కిషన్‌ రెడ్డి అమాయకత్వానికి నిదర్శనమన్నారు.

లోక్‌సభలో ఈ నెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ చేసిన ప్రకటనను కిషన్‌ రెడ్డి ఒకసారి చదవాలని హితవు పలికారు కేటీఆర్‌. 2018 నుంచి తెలంగాణకు ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆ ప్రకటనలో చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తన సహచర మంత్రి చేసిన ప్రకటన అబద్ధమా...లేక కిషన్‌ రెడ్డి తన అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇటీవలి భారీ వర్షాలతో జరిగిన ప్రాథమిక నష్టం 14 వందల కోట్లని తేల్చి ఎన్డీఆర్ఎఫ్ నిధులు అందించాలని కోరితే..కేవలం బృందాలను పంపించి కేంద్రం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ వరదల తర్వాత కేంద్ర బృందం రూపొందించిన నివేదిక ఏమైందో ప్రజలకు వివరించాలని, ప్రత్యేక సాయం ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News