TG : కేటీఆర్ కు మతిభ్రమించి.. పిచ్చి మాటలు మాట్లాడుతున్నడు : మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు మతి భ్రమించిందని, అందుకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసివేసి గాంధీభవన్ కు పంపిస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోగా, 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారని, ప్రజలు చంప మీద కొట్టినట్లు బుద్ధి చెప్పినప్పటికీ మార్పు రాలేదని కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం సంపాదన మీదనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధారపడి పని చేశారని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్ ను కలవాలంటే 5 సంవత్సరాలు పట్టేదని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా ఎవరైనా కలువచ్చని, మేము ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేత పై వివరణ అడగగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఉన్నత న్యాయస్థానమే తప్పుడు నిర్మాణమని పేర్కొందని అన్నారు. న్యాయస్థాన తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు. జమిలి ఎన్నికలపై జాతీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారని, ఇప్పుడు ఏం మాట్లాడలేమని అన్నారు. మీడియా సమావేశంలో ఎంపీ కుందూరు రఘువీరా రెడ్డి, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జై వీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, చిరుమర్రి కృష్ణయ్య, తమ్మడ బోయిన అర్జున్, పొదిళ్ల శ్రీనివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.