లాయర్ రోబ్ ధరించకుండా నిర్లక్ష్యంగా కోర్టుకు హాజరైన ఓ న్యాయవాదికి అలహాబాద్ హైకోర్టు జైలుశిక్ష విధించింది. అంతటితో ఊరుకోకుండా జరిమానా కూడా వేసింది. ఆయన లాయర్ ప్రాక్టీస్ ఎందుకు నిలిపివేయకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. కోర్టు ప్రొసీడింగ్ కు హాజరైన సదరు అడ్వకేట్.. చొక్కాకు గుండీలు లేకపోవడాన్ని కూడా హైకోర్టు న్యాయమూర్తులు గుర్తించి మందలించారు. అలహాబాద్ కు చెందిన న్యాయవాది అశోక్ పాండే.. 2021, ఆగస్టు 18న కోర్టుకు హాజరైన తీరు పట్ల అప్పటి న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదులు తమ మెడ చుట్టూ ధరించే రోబ్ లేకుండా, చొక్కాకు గుండీలు పెట్టుకోకుండా కోర్టుకు హాజరైన కేసులో అలహాబాద్ హైకోర్టు తన తీర్పును వెల్లడించింది.
జస్టిస్ వివేక్ చౌదరీ, బీఆర్ సింగ్ లతో కూడిన డివిజన్ బెంచ్.. తీర్పు వెలువరిస్తూ ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యం లో కఠిన శిక్ష విధిస్తున్నట్లు చెప్పారు. 2021 నాటి కోర్టు ధిక్కరణ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది. దీనితో పాటు రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల రోజులు అదనంగా జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. 4 వారాల్లోగా లక్నోలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట సరెండర్ కావాలని న్యాయవాది అశోక్ పాండేను డివిజన్ బెంచ్ ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ లీగల్ ప్రాక్టీసు చేయకుండా ఎందుకు నిషేధం విధించరాదో సమాధానం ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది.