LOCAL WAR: వణికించే చలిలోనూ ఓటెత్తిన పల్లెలు
85.86 శాతం పల్లె ప్రజల ఓటు... తొలి విడత కన్నా 1.58 శాతం ఎక్కువ.. యాదాద్రి భువనగిరిలో అత్యధికం
రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. వణికించే చలిలోనూ ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఉదయం నుంచే బారులు తీరారు. 85.86 శాతం పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన(84.28%) పోలింగ్ కన్నా ఇది 1.58 శాతం ఎక్కువ. ఆదివారం సెలవురోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని మూడు గ్రామాల్లో, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో రెండు గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్యులకు పోటీపడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్ నమోదైంది.
నిజామాబాద్‌లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటు వేయగా వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళా ఓటర్లలో 23,93,010.. పురుష ఓటర్లు 26,57,702లో 22,77,902 మంది.. ఇతరుల్లో 143కు 60 మంది ఓట్లు వేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. 1 గంటకు పోలింగు ముగియగా... మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. పోటీ హోరాహోరీగా జరగడంతో చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. పలు చోట్ల ఒకటి, రెండు.. ఇలా తక్కువ మెజార్టీతోనూ చాలా మంది విజయం సాధించారు. ఆదివారం రాత్రి రెండో విడత ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచి ఎన్నికలను అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యులను సమావేశపరిచి ఉపసర్పంచులను ఎన్నుకున్నారు.
దక్షిణ భారతంపైకి చలిగాలులు
వాయవ్య, మధ్య భారతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సైబీరియా నుంచి వచ్చే శీతల గాలులు మధ్య భారతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ భారతంపైకి వీస్తున్నాయి. చాలాకాలం తర్వాత చలిగాలులు తెలంగాణ, కోస్తా, రాయలసీమ, ఉత్తర కర్ణాటక మీదుగా తమిళనాడులోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. పది రోజుల నుంచి చలి గాలుల జోరు తగ్గలేదు. ఉత్తరకోస్తాలో ఏజెన్సీ ప్రాంతాలతోపాటు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం అరకులోయలో 4.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మైదాన ప్రాంతంలోని శ్రీసత్యసాయి జిల్లా ఆర్.అనంతపురంలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.