TS: ధరణి పోర్టల్‌పై లోతైన అధ్యయనం
పోర్టల్‌లో అనేక లోపాలు గుర్తించిన కమిటీ... కలెక్టర్లతో సుదీర్ఘంగా భేటీ;
తెలంగాణలో ధరణి పోర్టల్ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది. కలెక్టర్ల సమావేశంలో సమావేశమైన కమిటీ.. పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని గుర్తించింది. 35 మ్యాడ్యూల్స్ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది. 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా.. 23 లక్షలు ఎకరాలు పార్ట్-బిలో ఉన్నట్లు కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ... ఈనెల 27న గిరిజన, అటవీ, వ్యవసాయ శాఖల అధికారులతో సమవేశం కావాలని నిర్ణయించింది. భూ రికార్డులను కంప్యూటరీకరణ చేసిన గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చింది. సంకల్పం గొప్పదైనా.. ఆచరణలో మాత్రం ఇబ్బందులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని.. దాని స్థానంలో మెరుగైన మరో వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పోర్టల్ వ్యవస్థపై అధ్యయనానికి కమిటీని వేసింది. నాలుగుసార్లు సమావేశమైన కమిటీ ధరణి పోర్టల్ అమలులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బుధవారం సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైంది. కలెక్టర్లు సైతం చాలా లోపాలను తమ దృష్టికి కలెక్టర్లు తెచ్చారని కమిటీ పేర్కొంది. తెలంగాణలో భూసమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని..చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ధరణి పోర్టల్ వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని వ్యాఖ్యానించింది.
సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన కమిటీ సభ్యులు ధరణి పోర్టల్ సవరణ మార్గదర్శకాలు, చట్టబద్దత లేకపోవడంపై ప్రశ్నలు అడిగారు. కమిటీ సూచన మేరకు ఏడు అంశాలపై కలెక్టర్లు వివరాలను అందించారు.ధరణి పోర్టల్ నిర్వహణ సంస్థ టెర్రాసిస్ ప్రతినిధులతోనూ సుదీర్ఘంగా కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి మాడ్యుల్స్ ఎలా పనిచేస్తున్నాయి ? దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ ఏ దశల్లో సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుంది.? ఎదురవుతున్న సమస్యలపై లోతుగా ఆరా తీశారు. సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యుల్స్ అవసరమని, దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్‌లైన్‌లోనే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.
చట్టం తెచ్చినప్పటికీ... అధికారులకు ఏలాంటి అధికారాలు ఉంటాయో స్పష్టత ఇవ్వలేదని, చట్టాన్ని సమర్ధంగా అమలు చేసేందుకు తగిన మార్గదర్శకాలు.. గత ప్రభుత్వం ఇవ్వలేదని కమిటీ దృష్టికి కలెక్టర్లు తెచ్చినట్లు తెలుస్తోంది. 18లక్షల ఎకరాలు భూమి పార్ట్-బి నిషేదిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా... అనధికారికంగా 23 లక్షల ఎకరాలు ఉన్నట్లు కమిటీ పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం. బాధ్యతలన్నీ కలెక్టర్లకు అప్పగించడం వల్ల వస్తున్న సమస్యలు, గ్రామస్థాయిలో ధరణి సమస్యల పరిష్కారానికి తగిన యంత్రాంగం లేకపోవడం వల్ల ఎదురువుతున్న ఇబ్బందులు, చట్టపరంగా చేయాల్సిన మార్పులపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.