తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో అలజడి మొదలైంది. ములుగుజిల్లా చల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్ కు నిరసనగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి పోలీసులు అతి కిరాతంగా చంపారని పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ జిల్లాల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది. బస్టాండ్‌లు, హోటళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మావోయిస్టు బంద్ వేళ ఏం జరుగుతుందోని ఏజెన్సీ వాసులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు