హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికలకు కాంగ్రెస్, BRS దూరంగా ఉండటంతో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో నిలిచాయి. మొత్తం 112 ఓట్లకు గానూ 88 ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 22 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగింది. బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలో దింపడంతో ఈ ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 23న ఎన్నిక జరిగింది.
ఇక్కడ మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా.. తర్వాత స్థానంలో బీజేపీ ఉంది. ఎంఐఎంకు 49 ఓట్లుండగా ఇతర పార్టీల మద్దతు లభించింది. మొత్తం ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు కాగా, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ లకు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు 9 చొప్పున ఉండగా.. కాంగ్రెస్‌కు ఏడు, బీజేపీకు ఆరు ఉన్నాయి.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన గౌతమ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు కాంగ్రెస్ సహకరించిందని ఆరోపించారు. కార్పోరేటర్లు ఓట్లు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ ను ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మూడు పార్టీలు ఒక్కటేనని, ఎంఐఎం చెప్పినట్లుగా కాంగ్రెస్ చేస్తోందన్నారు.