ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు ఆలయాలను దర్శించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి భట్టి విక్రమార్క (Minister bhatti vikramarka) అన్నారు. మంగళవారం సచివాలయంలో ఎండోమెంట్స్, అటవీ, పర్యావరణ శాఖల బడ్జెట్‌పై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెద్దగా ఆదాయం లేని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆర్థిక సాయం అందించే పథకాన్ని సరళతరం చేయాలని సూచించారు. ప్రధానంగా అటవీ శాఖతో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంతో టూరిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని నాగోబా, మేడారం వంటి గిరిజన జాతరలకు సంబంధించి దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు.
రాష్ట్రంలోని అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఏజెన్సీ గిరిజనులు, అటవీ భూములకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ఆయుర్వేద సంబంధిత ఔషధ తోటలను ప్రారంభించాలని భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. ఈ ఔషధ తోటల మార్కెటింగ్‌ను ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో అనుసంధానం చేయాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీలు, ఎకో టూరిజాన్ని నగరవాసులు స్వాగతిస్తున్నారని, ఇలాంటి టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాల కోసం సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని భట్టి ఆదేశించారు.
దేవుడి పుణ్యక్షేత్రాల పరిరక్షణతో పాటు అన్యాక్రాంతమైన భూములను వెలికితీసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారని తెలిపారు. గణనీయమైన ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. తిరుమలలో తెలంగాణ భక్తులకు కూడా ప్రాధాన్యత ఉండేలా చూడాలని డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. అడవి జంతువుల దాడిలో ఎవరైనా చనిపోతే పరిహారం రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు తమ ప్రభుత్వం పెంచిందని చెప్పారు. రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీలను పునర్‌వ్యవస్థీకరిస్తామన్నారు.