Indiramma Indla : మంత్రి గుడ్ న్యూ్స్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద త్వరలో ఇండ్ల మంజూరు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు అపార్ట్‌మెంట్ తరహాలు ఇండ్లను అందించేలా తీయటి కబురు త్వరలో చెబుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జిహెచ్ఎంసీ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలోగల రసూల్ పురలో 344 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సహచర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గణేష్ తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసినసభలో మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 30 నుచి70 గజాలున్నాసరే స్ధానికంగా నివసించే వారికి అపార్ట్‌మెంట్ తరహాలో ఇండ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో తాను ఈ ప్రాంతంలో మొండి గోడలతో ఉన్న ఇండ్లను పూర్తిచేసి ఇస్తానని మాట ఇచ్చానని దానిని నెరవేర్చామని తెలిపారు.
నాటి ప్రభుత్వంలో దొరవారు పేదలకు ఇండ్లు కడితే కమీషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్ట్‌పైనే దృష్టి సారించారని, ఆనాడు ఏడాదికి లక్ష ఇండ్లు కట్టినా పదేళ్లలో పదిలక్షల ఇండ్లు పేదలకు వచ్చేవని అన్నారు. కానీ పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా తొలివిడతగా 4.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి సంకల్పించిందన్నారు. మరో మూడు విడతల్లో కూడా మంజూరు చేస్తామని దీనిలో భాగంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.