చచ్చిన పార్టీని బతికించుకోవడం కోసమే బీఆర్ఎస్ నాయకులు ఈ డ్రామాలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. అరెకపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోడని కామెంట్ చేశారు. రాష్ట్రంలో లేని ప్రాంతీయ సెంటిమెంట్‌ని రగిల్చి దాన్ని బీఆర్ఎస్ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. అదే ఆ పార్టీ విధానమా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి సెంటిమెంట్లు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించారని అన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీయడమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.