Minister Ponguleti : హరీష్‌రావు హావభావాలకు మంత్రి పొంగులేటి క్యాప్షన్!
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒక ఫోటో వేయి పదాలకు సమానం అన్నట్లుగా మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ హైదరాబాద్‌లో నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్‌లో ఓ ఛాయాచిత్రం ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని విపరీతంగా ఆకర్షించింది. ఆఫోటో ఎవరిదోకాదు.. ప్రతిపక్షానికి చెందిన మాజీ మంత్రి హరీష్‌రావుది కావడం గమనార్హం! మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఓ సందర్భంలో వ్యక్తం చేసిన హావభావాలను హైదరాబాద్‌కు చెందిన కె. దుర్గా నరసింహారావు అనే ఫోటోగ్రాఫర్ ఒడిసిపట్టారు. సరిగ్గా అదే సమయంలో కెమెరాను క్లిక్ మనిపించి ఫోటోను ఎగ్జిబిషన్ పోటీలకు పంపించి ప్రత్యేక కన్సోలేషన్ బహుమతి పట్టేశారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న సమయంలో ఆ ఫోటో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మరీ ఎక్కువగా ఆకర్షించింది. అందుకే ఆయన తన ప్రసంగంలో ఈ ఫోటో గురించి ప్రస్తావిస్తూ ఆ ఫోటోకు తనదైన శైలిలో క్యాప్సన్ పెట్టారు. ఇంకేముంది ..అంతా అయిపోయింది అంటూ హరీష్‌రావులో నెలకొన్న నైరాశ్యాన్ని ఈ ఫోటో ప్రపంచానికి పరిచయం చేసిందని పొంగులేటి వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి కళ్లను ఆకర్షించిన ఈ కెమెరామెన్ పనితనం చూస్తే.. ఇది కదా ఫోటో అని అనిపిస్తోంది.