MLC: ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో చెరో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌.. మార్చి 3వ తేదీన కౌంటింగ్‌;

Update: 2025-02-28 01:00 GMT

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని పెంచిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి.. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అధికారులు పోలింగ్ నిర్వహించారు.

ఓటేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓటుకి నోటు అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ వీడియో రిలీజ్‌ చేయడం చర్చనీయాంశమైంది.

తెలంగాణలోనూ...

తెలంగాణలోనూ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. రెండు టీచర్‌, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో ఒక టీచర్స్‌ స్థానానికి, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండలో మరో టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. 

Tags:    

Similar News