Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు..;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం చల్లబడడమే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపరితల ఆవర్తన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఐదు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, నల్గొండ, నారాయణపేట్, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ విషయానికి వస్తే ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, ఏలూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్లకింద ఎవరూ ఉండకూడదన్నారు.