ములుగు జిల్లా పేరును ‘సమ్మక్క, సారలమ్మ’ గా మార్చేందుకు మంత్రి సీతక్క ( MInister Seethakka ) విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా.. రెండో విడతలో నారాయణ పేటతో కలిపి ములుగును 2019 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ములుగు అంతకుముందు వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండగా.. తొమ్మిది మండలాలు, దాదాపు 3 లక్షల జనాభాతో ములుగు జిల్లా ఏర్పాటైంది.
దీని పరిధిలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయి గూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలు ఉండగా.. వాటి పరిధిలో మొత్తంగా 336 గ్రామాలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల పరిధిలో మంగళవారం ఉదయం నుంచే గ్రామ సభలు నిర్వహించనున్నారు.