ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో ( Jeevan Reddy ) రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(BRS) కాంగ్రెస్‌లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవని, సీనియర్లకు తగిన గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ఇకపై ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో చర్చించి తీసుకుంటామని మున్షీ తెలిపారు.
కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలన్నారు జీవన్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చాయని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, జాతి ఐక్యతను కాంగ్రెస్ కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలుకాని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఏకకాలంలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీకి కాంగ్రెస్ సంకల్పించదని ఆయన హర్షం వ్యక్తం చేశారు.