NEET : ‘నీట్’ మార్కులపై కమిటీ: ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్
ఆ 1500 మంది మార్కులను సమీక్షిస్తాం:;
నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశించడానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- యూజీ 2024 నిర్వహణలో అక్రమాలు జరిగాయని విద్యార్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే 67 మంది అభ్యర్థులు వంద శాతం మార్కులతో మొదటి ర్యాంక్ పొందారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుబోధ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ పరీక్షకు సంబంధించి కేవలం ఆరు పరీక్షా కేంద్రాల్లోనే సమస్యలు తలెత్తినట్టు నిర్ణారణ అయ్యిందని చెప్పారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కుల గురించి సమీక్షిస్తున్నామని, అనుమానాస్పదంగా ఉన్న 1500 మంది విద్యార్థుల మార్కులను పునః పరిశీలించడానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దాని నివేదిక అనంతరం తగిన చర్య తీసుకుంటామన్నారు.అయితే నీట్ ప్రవేశాల ప్రక్రియపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.
నీట్ నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల మార్పు, గ్రేస్ మార్కులు, కొన్ని సెంటర్లలో తక్కువ సమయం కేటాయింపు వంటివి సమస్యలుగా గుర్తించామన్నారు. తాము అన్ని అంశాలను పారదర్శకంగా పరిళీలించిన తర్వాతే తుది ఫలితాలు వెల్లడించామన్నారు. నీట్ పరీక్ష సమగ్రతకు ఎలాంటి భంగం కలగ లేదని, దానిని కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద పోటీ పరీక్ష అయిన నీట్‌ను 4,750 కేంద్రాల్లో నిర్వహించగా, 24 లక్షల మంది హాజరయ్యారని, అయితే ఆరు కేంద్రాల్లో ప్రశ్న పత్రాలను తప్పుగా పంచడం వల్ల 16 వేల మంది విద్యార్థులపై దీని ప్రభావం పడిందన్నారు. తమకు పరీక్షల్లో తక్కువ సమయం కేటాయించారని ఆరోపిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనిపై నిపుణుల కమిటీని వేసి వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆయా సెంటర్ల నుంచి వచ్చిన నివేదికలతో పాటు సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించి నిజాలు నిర్ధారిస్తామని చెప్పారు.