తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ అబ్కారీ శాఖ వెల్లడించింది. ఇందులో 331 రకాల స్వదేశీ లిక్కర్ బ్రాండ్లు కాగా.. 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లకు దరఖాస్తుల వచ్చాయని పేర్కొంది. 47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు రాగా.. 45 పాత కంపెనీల నుంచి 218 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.
తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ..ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొంది. తెలంగాణలో తొలిసారిగా కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం 47 కొత్త కంపెనీలు 386 రకాల మద్యం బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపింది. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ తెలిపారు. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం కొత్త బ్రాండ్లకు ప్రభుత్వ ఆమోద ముద్ర పడిన తర్వాత అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.