భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 పేరుతో శాసనసభలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020ను రద్దుకు ప్రతిపాదించారు. పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ధరణి పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 9న ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, న్యాయనిపుణుడు భూమి సునీల్‌కుమార్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్‌లతోపాటు సీసీఎల్‌ఏలతో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలు చర్చలు నిర్వహించింది. కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్ సర్వేను చేపట్టి కీలక సమస్యలను గుర్తించింది. అనంతరం రాష్ట్రానికి అవసరమైన ఆర్వోఆర్ చట్ట రూపకల్పన బాధ్యతను నిపుణులకు అప్పగించింది.