నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం అయింది. 50 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది..;
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం అయింది. 50 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 399 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ చేపడుతున్నారు. ఓటర్లలో 24 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. పోస్టల్ బ్యాలెట్ లేదా చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ స్టేషన్లలో సెల్‌ఫోన్లను అనుమతించడంలేదు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 12న జరగనుంది. దీనికోసం 6 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రౌండ్లలోనే కౌంటింగ్ ప్రక్రియ పూర్తై... మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.
టీఆర్‌ఆఎస్ అభ్యర్థిగా కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. మొత్తం 824 మంది ఓటర్లలో.. 49 జెడ్పీటీసీలు, 535 ఎంపీటీసీలు, 226 మంది కౌన్సిలర్లు, 12 మంది ఇతరులున్నారు. పార్టీల పరంగా బలాలు చూస్తే టీఆర్‌ఎస్ 494, కాంగ్రెస్ 140, బీజేపీ 84, స్వతంత్రులు 66, MIMకు 28 ఓట్లున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 67 ఓట్లు ఉండగా.. చందూర్‌లో అతి తక్కువగా నాలుగు ఓట్లున్నాయి. వీటిలో 14 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు.
అటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్నిచర్యలు తీసుకున్నారు.. కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరుపుతామని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 22 మంది సీఐలు, 72 మంది ఎస్సైలు, 396 మంది కానిస్టేబుళ్లు, 220 మంది హోంగార్డులు, ఏఆర్ సిబ్బంది రక్షణ విధుల్లో పాల్గొన్నారు.