CM Revanth Reddy : సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరు: సీఎం రేవంత్
సన్న బియ్యం పథకాన్ని ఎవరూ రద్దు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో రూ.11వేల కోట్ల రుణమాఫీ చేస్తే, తాము అధికారంలోకి వచ్చాక ఆర్నెల్లలోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర తమదని చెప్పారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తామని రేవంత్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు. రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని చెప్పి ఫామ్ హౌస్‌లో ఎకరాల కొద్దీ పండించారని అన్నారు. రూ.4,500కు క్వింటా చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మూడేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే.. మూడేళ్లలోనే కూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కావాలనే శ్రీశైలం ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు.
70 ఏళ్ల క్రితమే పీడీఎస్ పథకాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. దానినే ఎన్టీఆర్ కొనసాగించారని హుజూర్ నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. పేదలు అన్నం తినాలని గతంలో 90 పైసలకే బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10వేల కోట్ల దోపిడీ జరుగుతోందన్నారు. దీంతో మిల్లర్ల మాఫియా విస్తరిస్తోందన్నారు. పేదలు తినాలనే సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు.