సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కొరతను ట్విట్టర్ లో హైలైట్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులు క్యూలైన్‌లో నిలబడలేక అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. క్యూలైన్ కోసం రైతులు పేపర్లు.. పాస్ పుస్తకాల కవర్లను క్యూలైన్‌గా పేర్చిన ఫొటోలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రైతులు ఎక్కువ సేపు నిలబడలేక తమ వెంట తెచ్చుకున్న పాస్‌బుక్ కవర్లను క్యూలైన్‌లో పెట్టారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతం అయ్యాయని కేటీఆర్ అన్నారు. పదేళ్లపాటుగా కనిపించని కరెంటు కోతలను ఇప్పుడు మరోసారి చూస్తున్నామని అన్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రజలు ముట్టడించడం చూస్తున్నామన్నారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యంగా అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లను చూస్తున్నామన్నారు. ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నామని ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు పెట్టారు.