TG: నిమిషానికి రూ. కోటి అప్పు

రోజుకు రూ. 1700 కోట్లు అప్పు చేస్తుందన్న బీజేపీ... కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు;

Update: 2025-03-21 08:00 GMT

 తెలంగాణ ప్రభుత్వం నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి శాసనసభలో ఆరోపించారు. తెలంగాణ అప్పు రూ.8.6 లక్షల కోట్లుగా ఉందని.. రోజుకు ఇది రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు అప్పు చేస్తోందన్నారు. కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3.54 కోట్లుగా తేలిందన్న ఆయన... తెలంగాణలో ఒక్కో వ్యక్తిపై రూ.2.27 లక్షల రుణభారం ఉందని తెలిపారు.

మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?: హరీశ్

మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి VLR వర్తిస్తుందనే ఉత్తర్వులు ఎక్కడైనా ఉంటే చూపాలని భట్టి విక్రమార్కను హరీశ్ కోరారు. మహిళల్ని మోసం చేసిందనందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కట్టిన ఇల్లు ఒక్కటన్నా ఉందా? మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా, చూపిస్తరా భట్టి అన్నా అని హరీశ్ నిలదీశారు.

ఆ రోడ్లకు టోల్‌ విధించే ఆలోచన లేదు: కోమటిరెడ్డి

గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్‌ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్‌ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే రోడ్లు వేశారని విమర్శించారు. మూడున్నర నుంచి నాలుగేళ్లలో ఔటర్ రింగ్ రోడ్డును పూర్తి చేస్తామని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని... ఆ మూడు చోట్ల రోడ్లకు చివరకు సింగరేణి నిధులు కూడా వాడారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఛాలెంజ్‌ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా? అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మంత్రి కోమటిరెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానన్న హరీశ్‌రావు.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. ఒక రోజు రోడ్ల గురించి ప్రత్యేకంగా చర్చిద్దామని సూచించారు. రాష్ట్రమంతా రోడ్లు వేశామని హరీశ్‌రావు చెప్పారన్న సభాపతి ప్రసాద్‌... వికారాబాద్‌ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని సభాపతి అన్నారు. 

Tags:    

Similar News