PONGULETI: ప్రతి ఎకరకూ భద్రత కోసమే భూ భారతి
ధరణి పోర్టల్ తో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారన్న మంత్రి పొంగులేటి... ధరణిని తొలగించి కొత్తగా ఈ భూ-భారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి;
తెలంగాణలో ప్రతి ఎకరాకూ భద్రత కల్పించడమే లక్ష్యంగా భూభారతి బిల్లును ప్రవేశపెడుతున్నామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన ధరణి పోర్టల్‌లో లక్షల సమస్యలు వచ్చాయన్నారు. ధరణి పోర్టల్ తో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని, గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాల దాకా వెళ్లిందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని తెలిపారు. ధరణిని తొలగించి కొత్తగా ఈ భూ-భారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఇకపోతే, భూ-భారతి బిల్లులోని ప్రధానాంశాలు, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. గత పాలకులు తెచ్చిన ఈ లోప భూఇష్ట చట్టం వల్ల భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటి కాళ్ల కింద నేల కదిలిపోయిందని విమర్శించారు. బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నా.. పరిష్కారం చేసే మార్గం లేకుండా పోయిందని చెప్పారు. లోపభూయిష్టమైన ఆర్‌వోఆర్ చట్టం-2020ని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. లోపాల కారణంగా నాలుగు నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అన్నారు.
భూ-భారతి ప్రత్యేకతలు:
• ఆరు మాడ్యూళ్లు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదించారు.
• 11 కాలమ్‌లు : గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేసారు.
• డిస్‌ప్లే : గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేసారు.
• ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.
• భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్ళే సౌకర్యాన్ని కల్పించారు.
• గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బట్టబయలు చేసారు.
• 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేసారు.
• ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం అని అన్నారు.