REVANTH: ఏం చేశారని ఓట్లు అడుగుతారు
జూబ్లీహిల్స్‌లో రేవంత్ ప్రచారం.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు
తెలంగాణ, జూబ్లీహిల్స్‌కు ఏం చేశారని బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే నమ్మకం ఉందని రేవంత్ అన్నారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని.. అవకాశం అందరికీ అన్నిసార్లు రాకపోవచ్చన్నారు. అవకాశం వస్తే మన కోసం కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోవాలని.. మనకోసం కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోకపోతే చారిత్రక తప్పిదమే అవుతుందని అన్నారు.
బీఆర్ఎస్ సచ్చిపోయి,,,
త పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సచ్చిపోయి బీజేపీని గెలిపించిందని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేసి తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమన్నారు. బీఆర్ఎస్తో కలిసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనని ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.
ఆర్థిక సాయానికి ప్రణాళికలు
వరదలు తగ్గిన నేపథ్యంలో శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ ఆదేశించారు. వరదల్లో ప్రాణ నష్టం జరిగినచోట రూ.5 లక్షలు పరిహారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకు సంబధించి వివరాలు సేకరించాలని.. పంటనష్టం, పశు సంపద నష్టపోయిన చోట వారికి పరిహారం అందించాలన్నారు. ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. "ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు..ఎకరా పంట నష్టానికి రూ.10వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలి. ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దు. క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలి. అధికారులు నిర్లక్ష్యం వదలండి క్షేత్రస్థాయికి వెళ్లండి.. కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.