TG : నియంత పాలన నుంచి స్వేచ్ఛకు ప్రతీకగా ప్రజాపాలన దినోత్సవం- సీఎం రేవంత్
గడచిన పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందనీ.. ఆ బానిస సంకెళ్లను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్ 17 అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పబ్లిక్ గార్డెన్ ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న సీఎం సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. "నేను పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాను. తెలంగాణను నియంత పాలన నుండి విముక్తి చేస్తానని చెప్పాను.
గజ్వేల్ గడ్డ మీద 2021 సెప్టెంబర్ 17 నాడు ‘‘దళిత - గిరిజన ఆత్మగౌరవ దండోరా’’ మోగించినం. 2023 డిసెంబర్ 3 నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా అధికారికంగా నిర్వహిస్తున్నాం." అని చెప్పారు.
"మీ బిడ్డగా తెలంగాణ గుండె చప్పుడు తెలిసిన వాడిగా అధికారంలోకి రాగానే సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాను. అందెశ్రీ రచించిన ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’’ గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాం. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టినం. తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త నామం TS ను TG గా మార్చాం. ఇది కేవలం అక్షరాల మార్పు కాదు... ప్రజల ఆకాంక్షల తీర్పు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో ఇటీవలే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు మన తల్లి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ఇలా... ప్రతి ఆలోచనలో తెలంగాణ సాంస్కృతిక పూర్వ వైభవం దిశగా సాగుతున్నాం." అని సీఎం చెప్పారు.
"ఇటీవల బేగరి కంచె వద్ద ఫోర్త్ సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. మూసీ సుందరీకరణ హైదరాబాద్ రూపు రేఖలను మార్చి వేస్తుందనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు... వేలమంది చిరు, మధ్య తరగతి వ్యాపారులకు ఒక ఎకనామిక్ హబ్‌గా తీర్చి దిద్దబోతున్నాం. తెలంగాణలో యువ వికాసం కోసం ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఒకవైపు గడచిన పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలన విషయంలో కఠినంగా ఉంటున్నాం. టీ - న్యాబ్ ను బలోపేతం చేశాం. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన తెలంగాణ బిడ్డలను ఘనంగా గౌరవించుకున్నాం. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్‌గా మాత్రమే కాదు... క్లీన్ స్టేట్‌గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. " అని సీఎం చెప్పారు.