Leopard : రిలాక్స్ శంషాబాద్.. చిరుత కోసం మేకలు.. రిస్కీ ఆపరేషన్

Update: 2024-05-03 07:07 GMT

హైదరాబాద్ శివారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చిరుత కొద్దిరోజులుగా చాలామందికి హడల్ రేపింది. గత నాలుగు రోజులుగా చిరుత అక్కడక్కడే తిరుగుతూ దొరక్కుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఫారెస్ట్ అధికారులు ఈ చిరుతను పట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

4 రోజుల క్రితం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రన్‌వే పై చిరుత కనిపించింది. అటవీశాఖ అధికారులకు ఎయిర్‌పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చిరుత కోసం ఇరవై ట్రాప్‌ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఐదు బోన్లను ఉంచారు. కానీ.. చిరుత మాత్రం అటువైపుగా రాలేదు. ఒకానొక సమయంలో బోనువైపు వచ్చినా కూడా అందులోకి వెళ్లలేదు. చిరుతను బంధించాలని అటవీశాఖ అధికారులు బోన్లలో ఎరగా మేకలను కూడా ఉంచారు. బోను వరకు వచ్చి చిరుత వెనక్కి వెళ్లిపోయింది. వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు కూడా ఈ చిరుత తెలివైనదిలా ఉందంటూ కామెంట్స్ పెట్టారు. ఇలా నాలుగు రోజులు గడవడం.. చిరుత దొరక్కపోవడం సంచలనంగా మారింది.

చివరకు నాలుగు రోజుల తర్వాత చిరుతకు ఆకలేసిందో ఏమో కానీ.. బోనులో ఎరగా ఉంచిన మేకను తినేందుకు వచ్చింది. ఎట్టకేలకు బోనులో చిక్కుకుంది. చిరుత బోనులో చిక్కుకోవడంతో స్థానికులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోనులో చిక్కిన చిరుతకు సంబంధించిన ఫొటో సోషల్ ప్లాట్ ఫాంలలో తెగతిరుగుతోంది.

Tags:    

Similar News