REVANTH: విప్లవాత్మక మార్పులకు "మహాలక్ష్మి" కారణం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ;
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' ఒక సంక్షేమ పథకం.. అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కొందరు ఎగతాళి చేసినా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం.. ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా నేటికి 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇది ఈ పథకం అమలులో మరో మైలురాయిగా నిలిచింది. మహాలక్ష్మి పథకం విజయవంతానికి కారణమైన వారిపై రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఒక్క పథకం వల్ల ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగిందని… పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని సీఎం తెలిపారు. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి ఉందని పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి జారి పోతుందనే పరిస్థితి నెలకొని ఉందన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి మొదలైన ప్రయాణం నేడు 200 కోట్ల జీరో టికెట్లతో ఆడబిడ్డలకు సహాయం చేసే స్థాయికి ఎదిగిందన్నారు.