బంగాళాఖాతంలో గత నాలుగు రోజుల క్రితం ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారింది. అది మరింత బలహీనపడి ఆవర్తనంగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఒడిశా తీర ప్రాంతంపై కొనసాగుతుందని చెప్పారు. అయితే ఈ ఆవర్తనం మరింత బలహీన పడటం వల్ల వర్షాలకు ప్రస్తుతం అవకాశం లేదన్నారు. తెలంగాణతో పాటుగా ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు.రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తూ.. క్రమంగా చలి పెరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే పగటి ఉష్ణగ్రోతలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు కూడా చేరుకుంటున్నాయి. తీవ్రమైన వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడి పోతున్నారు.ఇక సాయంత్రం కాగానే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సాయంత్రం వేళల్లో, రాత్రి, తెల్లవారుజామున చలి తీవ్రత పెరుగుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 18 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇలాంటి వాతావరణమే ఉంది.