SAD: నాన్న.. ఏం చేశామని చంపేశావ్!

ఇద్దరు చిన్నారులను హత్య చేసిన తండ్రి.. తాను ఆత్మహత్యా యత్నం

Update: 2026-01-06 05:30 GMT

అభం శుభం తెలియని బాల్యం..ఆటలు తప్ప ఇంకేం తెలియని లోకం.... తల్లిదండ్రుల గొడవలు పట్టని ప్రాయం.. నాన్న చేతి వేళ్లను పట్టుకుని భద్రంగా నడవాల్సిన బాల్యం...కానీ ఆ చిన్న జీవితాలుఅర్ధరాత్రే తెల్లారిపోయాయి. చీకట్లో భయంతో వణికిన కళ్ల ముందు.. రక్షణగా ఉండాల్సిన తండ్రే మృత్యువుగా మారాడు. కన్నబిడ్డలను కాపాడాల్సిన తండ్రే కర్కశుడిగా మారి, ఎనిమిదేళ్ల రిత్విక, ఐదేళ్ల చైతన్యలను అమానుషంగా హతమార్చిన తీరు... తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. కుటుంబ విభేదాలు, ఒంటరితనం, మానసిక ఒత్తిడి కలిసి చివరకు ఓ తండ్రిని రాక్షసత్వంలోకి నెట్టేశాయి. “నాన్న” అని పిలవాల్సిన నోర్లు మూగబోయాయి. తమ చేతులను పట్టుకుని నడిపించాల్సిన తండ్రే,, ఆ చేతులతోనే వారి ప్రాణాలను చిదిమేశాడు. నాన్న మమ్మల్ని ఎందుకు చంపేశావ్... అని ఆ చిన్నారులు ప్రశ్నిస్తే... ఆ నాన్న ఏం సమాధానం చెప్తాడో... నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కన్నబిడ్డలనే అత్యంత కర్కశంగా హతమార్చిన తండ్రి, అనంతరం తానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు–బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరికల్ మండలం పరిధిలోని తేలేరు గ్రామానికి చెందిన శివరాములు–భార్య దంపతులకు రిత్విక (8), చైతన్య (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలోనే భార్యతో విడాకులు కావడంతో, శివరాములు ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఒత్తిడుల మధ్య శివరాములు తీవ్ర నిర్ణయానికి దిగినట్లు తెలుస్తోంది. ముందుగా పిల్లలకు క్రిమిసంహారక మందు తాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మందు ప్రభావం తక్షణమే కనిపించకపోవడంతో, పిల్లలను కోయిల్‌సాగర్ కాలువ వద్దకు తీసుకెళ్లి, అక్కడ అమానుషంగా తొక్కి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన గ్రామస్థులను షాక్‌కు గురిచేసింది. పిల్లల హత్య అనంతరం శివరాములు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ ప్రాణాలు పోకపోవడంతో సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అది కూడా ఫలించకపోవడంతో, తీవ్ర గాయాలతో చావు–బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శివరాములు తెల్లవారుజామున జరిగిన విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు.

వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి, వారి వెంట కలిసి కోయిల్‌సాగర్ కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువలో పడేసిన పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. వారు ప్రాణాలు విడిచినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ప్రస్తుతం శివరాములు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాము వెల్లడించారు. కుటుంబ విభేదాలు, మానసిక ఒత్తిడే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నప్పటికీ, పూర్తి నిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.

Tags:    

Similar News