Medaram Jathara : సమ్మక్క-సారలమ్మ వనప్రవేశంతో ముగిసిన మహా జాతర
Medaram Jathara : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర.. సమ్మక్క-సారలమ్మ మహాజాతర అట్టహాసంగా ముగిసింది.
Medaram Jathara : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర.. సమ్మక్క-సారలమ్మ మహాజాతర అట్టహాసంగా ముగిసింది. రెండేళ్ల కొకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజతరకు సుమారు రెండు కోట్ల మంది భక్తులు తరలివచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తమ ఇలవేల్పులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు నెల రోజుల పాటు భక్తులు తల్లుల దర్శనం కోసం తండోపతండాలుగా వచ్చారు.
ప్రధాన జాతర బుధవారం ప్రారంభం కాగా.. గురువారం సమ్మక్క రాకతో జాతర ముఖ్యమైన ఘట్టం మొదలైంది. శుక్రవారం తల్లులు గద్దెల పైనుంచి భక్తులకు దర్శన మివ్వడంతో మేడారం జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. నాలుగో రోజు సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో.. జాతర మహా ఘట్టం ముగిసింది.
తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కర్నాటకతో పాటు దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ రాగా.. గురువారం చిలుకల గట్టు నుంచి సమ్మక్క గద్దెకు చేరడంతో.. తల్లి బిడ్డల దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తల్లులిద్దరు కొలువుదీరిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని తరించారు.
గురువారం రాత్రి గద్దెలపై కొలువుదీరిన తల్లులిద్దరికి భక్తులు మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం మధ్యాహ్నం గద్దెలను శుద్ధిచేసి ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలతో తల్లులను గద్దెలపైకి తీసుకువచ్చారు.. సాయంత్రం తల్లులను వన ప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలుకల గట్టుకు.. సారలమ్మను కన్నెపల్లికి.. పగిడిద్దరాజును పునుగండ్ల కామారంకు.. రాజును కొండాయికి తీసుకువెళ్లడంతో జాతర మహాఘట్టం పూర్తైంది.
నాలుగు రోజులపాటు కన్నుల పండువగా జరిగిన గిరిజనమహోత్సవంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులతో పాటు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తో పాటు కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి రేణుకాసింగ్.. సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు, పోలీసులు.. ఈసారి కూడా మహా జాతరను దిగ్విజయంగా ముగించారు.