ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో తనను దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని ఆయనకు స్పీకర్ బదులిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు.