Choutuppal Road Accident: విధికి కన్నుకుట్టింది.. పెళ్లైన తొమ్మిది రోజులకే భర్తను దూరం చేసింది..

Choutuppal Road Accident: పదికాలాల పాటు మీ సంసారం పచ్చగా సాగాలని ఆశీర్వదించిన ఆ దంపతుల వైపు విధి చిన్న చూపు చూసింది. పెళ్లైన తొమ్మిది రోజులకే వరుడు మృతి చెందిన విషాద సంఘటన చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకుంది.

Update: 2022-08-30 07:30 GMT

Choutuppal Road Accident: పదికాలాల పాటు మీ సంసారం పచ్చగా సాగాలని ఆశీర్వదించిన ఆ దంపతుల వైపు విధి చిన్న చూపు చూసింది. పెళ్లైన తొమ్మిది రోజులకే వరుడు మృతి చెందిన విషాద సంఘటన చౌటుప్పల్ మండలంలో చోటు చేసుకుంది. శతాధిక వృద్ధులు చావు కోసం ఎదురుచూస్తుంటారు. అయినా దేవుడు ఇంకా వాళ్లను కనికరించడు.. కానీ కొందరి విషయంలో మాత్రం చాలా చిన్నచూపు చూస్తాడు.. ముక్కుపచ్చలారని పిల్లలను, ముచ్చటగా సంసారం చేసుకునేందుకు మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంటలను విడదీస్తాడు.

పెళ్లైన ఇరవై ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క సంతానం.. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తమకు వయసు మీద పడుతోందని 26 ఏళ్లు వచ్చిన కొడుక్కి పెళ్లి చేశారు. కొడుకు, కోడలు తమకు ఆసరాగా ఉంటారని ఆశించారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాడు. తానొక్కడే వెళ్లిపోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగా టోల్‌ప్లాజా వద్ద సోమవారం చోటు చేసుకుంది.

సూర్యాపేట జిల్లా ములకపల్లికి చెందిన రాములు, మైసమ్మ దంపతులు చాలా ఏళ్ల క్రితం నుంచి హైదరాబాద్‌లో ఉంటూ వాచ్‌మెన్ డ్యూటీ చేసేవారు.. కొడుకు వీరభద్రంను కష్టపడి చదించారు. వయసు మీదపడడంతో సొంతూరు ఆత్మకూరు వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరభద్రం హైద్రాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మేనమామ కూతురు ప్రణీతతో వీరభద్రంకు వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.

ఈనెల 21న దండుమైసమ్మ దేవాలయంలో వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లై పది రోజులు కూడా కాలేదు, కాళ్ల పారాణి కూడా ఆరలేదు.. అంతలోనే ప్రమాదం.. మృత్యువు ముంచుకొచ్చింది. వీరభద్రం యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

పెళ్లి కోసం వారం రోజులు లీవ్ పెట్టాడు.. అది పూర్తవడంతో భార్యతో కలిసి బైక్ మీద హైద్రాబాద్ వస్తున్నాడు వీరభద్రం. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే జాతీయ రహదారి పైనుంచి అదుపు తప్పి ద్విచక్రవాహనం టోల్‌గేట్ బోర్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరభద్రంకు తీవ్రగాయాలయ్యాయి. ప్రణీతకు చేయి విరిగింది. ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వీరభద్రం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రణీత వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.

ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.. 

Tags:    

Similar News